వనిత పాలిట విషకృతి వరకట్న దుష్కృతి - A woman's curse is a dowry evil
ఆయన మీకోసం మీజాతి నుండే జీవిత భాగస్వాము(స్త్రీ)లను సృజించాడు, వారి దగ్గర మీరు సౌఖ్యం పొందడానికి. ఇంకా ఆయన మీ మధ్య ప్రేమానురాగాలు, దయా దాక్షిణ్యాలను కూడా జనింపజేశాడు. ఇది కూడా ఆయన సూచనల్లోనిదే. యోచించే వారికి ఇందులో అనేక నిదర్శనాలున్నాయి. (అర్-రూమ్: 21)
మానవులందరికీ శుభం చేకూర్చగల శక్తి ఇస్లాం ధర్మానికి మాత్రమే ఉంది గనుక దీన్ని మానవ ధర్మం అన్నారు. శాశ్వత సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంది గనుక దీన్ని సత్య స్థిర ధర్మం అన్నారు. జీవ కోటిలో అనాదిగా ఉన్న విధేయతా విధానమే ఇస్లాం కాబట్టి దీన్ని అల్లాహ్ ధర్మమని, ఒక లక్ష 24 వేల మంది ప్రవక్తలు ఎంతో నిష్టగా పాటించిన జీవం సంవిధానమే ఇస్లాం గనక దీన్ని ప్రవక్తల ధర్మమని అన్నారు.
ఇస్లాం మూఢాచారాలు, అన్యాయంతో కూడిన కఠోరనియమాల్ని సమూలంగా తుడిచి పెట్టదల చింది. తల్లిదండ్రుల ఆస్తిలో కుమార్తెలకు వాటా ఇవ్వకపోవడం, వితంతువుని అత్తవారి ఆంక్షల నుండి బయటపడకుండా అణచిపెట్టడం (గడుపు తీరినా స్త్రీకి రెండవ పెళ్ళికి స్వేఛ్ఛ నివ్వక పోవడం, ముట్టయిన స్త్రీని అంటరానిదిగా చేసి ఆమెపై అనేక ఆంక్షలు విధించడం, సవతితల్లిని పెండ్లాడటం, ఏకకాలంలో ఇద్దరు అక్కాచెల్లెళ్ళను వివాహబంధంలో ఉంచడం, దన వికేంద్రీకరణను నిరోధించే దత్తస్వీకార విధానం. పెంపుడు కొడుకును కన్నకొడుకుగా పరిగణించి రక్త సంబంధాలు ఏర్పరచడం మొదలైన దురాచారాలను ఇస్లాం నిర్మూలించ పూనుకుంది.
వరకట్నం - మత, కుల, వర్గ సమస్య కానేకాదు. ఇది భారత సమాజపు ఉమ్మడి సమస్య. వీరు వారు అన్న తేడా లేకుండా అందరి ఆడకూతుళ్ళు అనుభవిస్తున్న అంతులేని బాధ, వ్యధ, వధ. భారత దేశపు ఎనిమిది హిందూ వివాహ పద్ధతులలోనూ వరునికి ధనమిచ్చే ప్రసక్తి లేనేలేదు. భారత ప్రాచీన కావ్యాలలో కూడా కన్యాశుల్కం అన్న మాట వినబడుతుంది కానీ వరశుల్కం అన్న మాట లేదు. మరి నేడు అటు నాస్తికుల్లోనూ, ఆస్తికుల్లోనూ సమానంగా కోరలు చాచుతున్న వరకట్న రక్కసి ఎలా పురుడు పోసుకుని జడలు విప్పి జూలు విదిలిస్తుంది అంటే...
కొన్ని సామాజిక రుగ్మతలు జనంలో నరనరాన జీర్ణించుకుపోతాయి. అలాంటిదే వరకట్న దురాచారం.
వరకట్నం ..ఒక జాఢ్యం - వరకట్నం ..ఒక సమస్య - వరకట్నం ..ఒక సామాజిక దోషం - వరకట్నం ..ఒక మూఢత్వం - వరకట్నం ..ఒక అనాగరికం - వరకట్నం ..ఒక తీరని దాహం - దీన్ని పార ద్రోలడం ..యెంతో ముఖ్యం !
అమ్మాయి కుందనపు బోమ్మైనా ! సుగుణవతి యైనా ! విద్యావంతరాలైనా ! ఉద్యోగస్తురాలైనా ! ఒక్కింటిదాన్ని చేయాలంటే ! వరకట్నం ఇచ్చుకోవాల్సిందే ! అప్పో సప్పోచేయాల్సిందే ! అస్థిపాస్తులైనా అమ్మాల్సిందే ! స్త్రీ కి శత్రువు స్త్రీ యే అన్న నానుడి అక్షరాల నిజం చేస్తున్నారు అత్త గారు - సంతలో పశువులా అబ్బాయి గారు -అంతులేని ఆశల త్రాచు ఆడపడుచు - ఒక్క మాటలో చెప్పాలంటే, కట్నం ఒక ఆచారం - నాడు సదుద్దేశ్యం తో ఏర్పరచారు ! కట్నం - ఒక దురాచారం - నేడు దురుద్ధేశ్యంతో పీడిస్తున్నారు !
మొన్న స్వయం వరం / నిన్న కన్యాశుల్కం / నేడు వర కట్నం / రేపు సమ కట్నం / పేరేదైతేనేమి బలయ్యేది వధువే కదా!
ప్రవక్త (స) వారి కాలంలో వివాహం ఎంతో సులభంగా ఉండేది
హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రజి) కథనం : దైవప్రవక్త (సఅసం) హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి) దుస్తులపై పసుపు పచ్చని రంగును చూచి "ఇదేమిటీ?” అని అడిగారు. “ఓ దైవప్రవక్తా (స)! నేను ఒక స్త్రీకి ఖర్జూరపు విత్తన మంత బంగారాన్ని మహర్ ఇచ్చి వివాహమాడాను” అని అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి) చెప్పారు. దానికాయన (స) “అల్లాహ్ నీకు శుభమొసగుగాక! ఒక మేకనయినా సరే కోసి వలీమా విందు తప్పకుండా చెయ్యి" అని అన్నారు. (బుఖారీ, ముస్లిం - హదీసు వాక్యాలు మాత్రం ముస్లింలోనివి)
అంటే, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి) గారు వివాహం చేసుకున్నారన్న విషయం అదే పత్తన్మలో ఉన్న - అది కూడా ముస్లింల అధినాయకులు, దైవ ప్రవకత అయినా ముహమ్మద్ (స) వారికే తెలియదు అంటే ఆ వివాహం ఎంత సహజంగా, సాదా సీదాగా జరిగి ఉంటుందో ఆలోచించండి! పైగా ఆయన (స) నన్నెందుకు పిలవలేదు, నాకెందుకు తెలుపలేదు అన్న ప్రశ్న కూడా వేయలేదు. వధూవరులిద్దరూ చల్లగా ఉండాల్నాయి దుఆ చేసి, ఆ సంతోషాన్ని పది మందితో పంచుకోవాల్సిందిగా సలహా ఇచ్చారు. ఇకపోతే వలీమా విందును వరుడు తన శక్తీ స్థోమతలకు తగ్గట్టుగా ఇవ్వవచ్చు. అయితే దుబారా ఖర్చు చేయకూడదు. దైవప్రవక్త (సఅసం) ఏర్పాటు చేసిన కొన్ని వలీమా విందుల్లో ఒక మేక కన్నా తక్కువ మాంసం ఉండేది. హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి) ఆర్థిక స్థోమత దృష్ట్యా ఒక మేక కోయటం తక్కువ ఖర్చు క్రిందికే వస్తుంది.
పుణ్య తరాలు గడిచిపోయాయి - ముస్లింలు ఇస్లామీయ పద్ధతిలోనే వివాహాలను కొనసాగించారు. ప్రపంచంలో ఇన్ని మార్పులు వచ్చినా నేటికీ అరబ్బుల్లో వివాహ సమయంలో అమ్మాయిలు ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు.
కానీ ఇస్లాం భారత ఉపఖండంలోకి వచ్చినప్పుడు, చాలా మంది భారతీయులు ఇస్లాం ప్రబోధించే ఉత్తమ నైతిక విలువల్ని, స్వచ్ఛమైన తౌహీద్ భావనకు ప్రభావితులై ఇస్లాం స్వీకరించారు. కాని వారు ఇస్లాంలో సరిగ్గా శిక్షణ పొందలేకపోయారు, దాని కారణంగా వారు జీవితంలోని ఇస్లామేతర ఆచారాలకు, అలవాట్లకు స్థానం కల్పించారు. ముస్లిం విశ్వాసాలు, మన ఆరాధనలు, మన వ్యవహారాలు మరియు ముస్లిం సమాజం తీరుతెన్నులు, ఆర్థిక వ్యవస్థ - అన్నీ అన్య మతాక్రాంతం అయ్యాయి. జీవితంలోని ఇతర రంగాలలో వలె పవిత్ర వివాహం వేడుకల్లో అస్లీల, అనైతిక చర్యలు, అసాంఘిక అంశాలు. వరకట్నం వంటివి చోటు చేసుకున్నాయి. ఫలితంగా ఈ రోజు, వివాహం ఒక ఆశీర్వాదం, దీవెనగా కాకుండా, ఒక భారంగా, శాపంగా మారింది. ఇది ముమ్మాటికీ అజ్ఞానపు ఆటవిక చేష్ట.
బరువుల్ని దించే ధర్మ ఇస్లాం
ఆయన మంచిపనులు చేయమని (ప్రజలను) ఆదేశిస్తాడు. చెడుల నుండి వారిస్తాడు. వారికోసం పరిశుద్ధ వస్తువుల్ని ధర్మసమ్మతం చేస్తాడు. అశుద్ధ వస్తువుల్ని నిషేధిస్తాడు. వారి మీద పడిన (ఆంక్షల) భారం తొలగిస్తాడు. వారు చిక్కు కున్న (దురాచార) బంధనాల నుండి వారికి విముక్తి కలిగిస్తాడు. కనుక ఎవరు అతడ్ని విశ్వసించి సమర్థించి అతనితో సహకరిస్తూ, అతనిపై అవతరించిన (ఖుర్‌ఆన్) జ్యోతిని అనుసరిస్తారో వారే సార్థకజీవులు. వారినే విజయం వరిస్తుంది. (అల్-ఆరాఫ్: 157)
వరకట్న దుష్కృతి ఎలా మొదలయింది?
మరి ఈ వరకట్నం మన సంఘంలో ఎప్పుడు ఎలా ప్రవేశించింది? అరబ్బుల దండయాత్ర తరువాత అనీ, పాశ్చాత్య పద్ధతి అనీ కొందరు అంటారు. కానీ ఇస్లాంలో వరుడు కన్యకు మెహర్ అనే పేరుతో ధనాన్ని ఇవ్వడం ఉంది కానీ వరకట్నం లేదు. పాశ్యాత్య దేశాలలోనూ డౌరీ లేదు. అసలు మన దేశంలోనూ, ఇతరత్రా ఎక్కడా లేని ఈ ఆచారం ఎప్పుడు, ఎలా ఉద్భవించింది, ఎలా వేళ్ళు ఊనుకుంది, ఎలా మర్రిచెట్టులా దశదిశలా వ్యాపించింది?
మనకు స్వతంత్రము వచ్చిన కొత్తలో చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగం అంటే రిటైర్ అయ్యే వరకు ఉద్యోగం మరియు ఆ తర్వాత పెన్షన్ మరియు కుటుంబ పెన్షన్ వస్తుంది. అంటే ఇలాంటి ఉద్యోగికి తమ అమ్మాయి నిచ్చి పెళ్ళి చేస్తే ఇంక ఆ అమ్మాయి జీవితం గురించి తల్లి దండ్రులకు బెంగ ఉండదు గదా. అప్పటి వరకు యువకులు ఏదో వ్యవసాయం లేదా వ్యాపారం చేసుకొని బతికే వారు. ఇలాంటి వారికి ఆదాయం నికరం గా ఉండదు. పైగా చెడు సహవాసం, చెడు అలవాట్లు ఉంటాయి. మరి వీరు ఉమ్మడి కుటుంబాల్లో ఉంటారు. ఇలాంటి వారికి పిల్లనిస్తే చాలా అవస్థ పడుతుంది కదా. అందువలన వెదకి, వెదకి ప్రభుత్వ ఉద్యోగులకే ఎక్కువ మంది తమ అమ్మాయి నిచ్చి పెళ్లి చేసే వారు. ఇలా వరులకు ప్రాధాన్యత పెరిగింది. అలాంటప్పుడు ఒకేసారి నలుగురు లేక అయిదుగురు ఆడ పిల్లల తండ్రులు ఒకే వరుని కోసం పోటీ పడే వారు. అప్పుడు సహజం గాఅమ్మాయి ల తల్లి దండ్రులు మొహమాట పెట్టి అమ్మాయి కి ఇంత ఆస్తి లేక కట్నం ఇస్తామని ముందుకు వచ్చే వారు. ఇలా వర కట్నం మొదలైనది. ఇలా కొన్ని వర్గాల్లో లేదా పరిస్థితుల్లో మొదలై చివరకు అదొక ఆచారము లేక దురాచారము అయిపోయింది. ఇప్పుడు సమాజం అంతా వ్యాపించినది.
వరకట్నం సమాజానికి శాపంగా ఎలా మారింది?
1) సున్నత్ ను సమాధి చేస్తున్నారు:
సత్య ప్రవక్త సత్సంప్రదాయాన్ని సమాధి చేసి - అమానవీయ అపనమ్మకాలు, అపచారాలను, రాక్షస రీతిరివాజులను, వికృత వివాహ విధానాలను జీవం పోస్తున్నారు. దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు; నా సంప్రదాయాన్ని కాదని, నా ఆజ్ఞకు శిరసావహించని వ్యక్తి - అతను అపకీర్తిని, అవమానాన్ని మూట గట్టుకుంటాడు. (ముస్నద్ అహ్మద్)
2) సత్కార్యానికి ప్రతి సత్కార్యం సంస్కారం
సత్కార్యానికి ప్రతిఫలం సత్కార్యం తప్ప మరేమవుతుంది?( అర్-రహ్మాన్:60)
మేలుకు ప్రతిగా మేలే చేయాలి. ఇదే కదా న్యాయం. మరి అమ్మానాన్నలు - ఆడకూతురిని అపురూపంగా పెంచి నట్టింట నడిచే అపరంజికి 18 - 20 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడి పెళ్లి చేస్తున్నారే. మరి మనం వారికిచ్చే గౌరవం ఏమిటి? వారు చేసిన మేలుకు తిరిగి మనం మేలు చేయడం పోయి - ఇంత అనాగరికంగా, అమానుషంగా వ్యహరిస్తున్నామే - నిజంగా మనం మనసున్న మనుషులమేనా, లేదా మనసు చచ్చిన మర మనుషులమా? అయినా ఆడపిల్ల కదా - సుఖంగా ఉంటుందిలే అన్న గంపెడాశతో చాలా మంది తల్లిదండ్రులు -గొడ్డు గోద అమ్ముకొని ఆస్తి పాస్తులు తాకట్టెట్టి. అప్పు సొప్పులు జేసి కట్న కానుక లిచ్చి పెండ్లి జేస్తరు. కోటి ఆశల పల్లకిలో సాగనంపుతారు. కానీ కాళ్ళ పారాణి, చేతులకద్దిన మెహందీ ఆర్కా ముందే కాటికి చేరుకుంటున్నాయి నేటి పడతి ప్రణయ ప్రయాణాలు. అసలుకే మనం మనం బంధువులమా? రాబంధువులమా? 'నీ రొట్టెను నువ్వు తింటే అది ప్రకృతి, నీ రొట్టె పక్కవాడికి పెడితే ...అది సంసృతి, పక్క వాడిది లాక్కొని తింటే వికృతి. ఈ నీతి దృష్ట్యా మనం నీతిగున్నట్టా? నీతి తప్పినట్టా? మనకు కనీస సంస్కారం ఉన్నట్టా? లేనట్టా?
3) కట్నం కావాలనడం పౌరుషానికి విరుద్ధం
ఖుర్ఆన్ లో ఇలా ఉంది: అల్లాహ్ స్త్రీలపై పురుషులకు కొంత ఆధిక్యత ప్రసాదించడం వల్ల, పురుషులు తమ సంపదను స్త్రీల కోసం ఖర్చుపెడ్తున్నందు వల్ల పురుషులు స్త్రీలపై వ్యవహారకర్తలు అవుతారు.(నిసా: 34)
ఈ ఆయతు దృష్ట్యా మనం వ్యవహారకర్తలమా? ఉబుసుపోక వ్యక్తులమా? కాలాన్ని బట్టి రంగులు మారే ఊసరవెల్లులమా? ఆత్మసమీక్ష చేసుకోవాలి.
4) ఒకరి సొమ్మును వారి అనుమతి, ఇష్టం లేకుండా తీసుకోకూడదు
ఈ అడ పిల్ల తండ్రైనా డిమాండ్ చేయబడిన కట్నాన్ని సంతోషంగా, మనస్ఫూర్తిగా ఇవ్వడు. దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: మీలోని ఏ ఒక్క వ్యక్తి సొమ్మును అతను స్వయంగా మనస్ఫూర్తిగా ఇస్తేగానీ తీసుకోవాదం ఎవరికీ ధర్మసమ్మతం కాదు (సహీహ్ అల్ జామే)
ఖుర్ఆన్ లో ఇలా ఉంది: మీరు ఒకరి ధనాన్ని మరొకరు అక్రమంగా కబళించకండి. (అల్-బఖరహ్: 188) ఈ ఆయతు దృష్ట్యా - మనం సక్రమార్కులమా, అక్రమార్కులమా,విక్రమార్కులమా? మనకు మనమే ఆత్మ నింద చేసుకోవాలి.
5) కట్నం తీసుకోవడం నరకానికి తీసుకెళుతుంది
హజ్రత్ జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అధర్మ సంపాదన ద్వారా పోషించబడిన శరీరం స్వర్గంలో ప్రవేశించదు. అధర్మ సంపాదన ద్వారా పోషించబడిన శరీరం నరకంలో వెళ్ళటానికే తగినది.” (అ’హ్మద్, తిర్మిజి’, బైహఖీ-షు’అబిల్ ఈమాన్)
6) కట్నం ఒక లంచం
“లంచం ఇచ్చేవారు మరియు లంచం పుచ్చుకునే వారిపై నుండి ‘అల్లాహ్ యొక్క కరుణ తొలిగి పోవుగాక’ అని మరియు ‘అల్లాహ్ యొక్క తిరస్కారం కలుగు గాక అని’ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం శపించినారు”. ముస్నద్ అహమద్ హదీథ్ గ్రంధం
ఆడబిడ్డ అమ్మానాన్నలు వేరే దారి లేక కట్నం ఇవ్వడానికి సిద్ధమవుతుండవచ్చు కానీ, వరునికి కట్నం తీసుకునే గత్యంతరం పరిస్థితి అయితే ఉండదు అయినా డిమాండ్ చేసో, ద్వంద వైఖరిని అవలంభించొ కట్నం తీసుకుంటారు. అలా వారు అన్యాయంగా, అనైతికంగా సంపాదించటానికి ప్రయత్నిస్తున్నారు. ఇతరుల సంపదను హరాం (నిషిద్ధమైన) పద్ధతిలో స్వంతం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.
7) కట్నం తీసుకోవడం అంటే కొత్త పద్ధతిలో భిక్షమెత్తుకోవడమే
అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ (ﷺ) హజ్రత్ ఖుబైసాతో ఇలా అన్నారు: "ఓ ఖుబైసా, (గుర్తుంచుకో) ధన సహాయం - అడగడం ముగ్గురికి మాత్రమే అనుమతించబడుతుంది." 1) చెల్లించ లేని లేమి స్థితిలో ఉన్న అప్పన్న వ్యక్తికి - రుణం తీరే మేరకు అడిగే అనుమతి ఉంది. ఆపై అడగకూడదు. 2) ఆకస్మిక విపత్తు కారణంగా ఆస్తి ధ్వంసమైన వ్యక్తికి అడగే అనుమతి ఉంది. కాబట్టి అలాంటి వ్యక్తిని అతని ఆహారం మరియు వస్త్రాల అవసరం మేరకు లేదా తన వ్యాపారాన్ని మెరుగుపరుచుకునేంత వరకు అడగడానికి అనుమతించ బడింది. 3) కూటికి కూడా గడవని కటిక పేదరికంతో బాధపడుతున్న వ్యక్తికి కూడా అడిగే అనుమతి ఉంటుంది. అయితే ఇది అతనికి తెలిసిన ముగ్గురు వ్యక్తులచే ధృవీకరించబడి ఉండాలి. (కాబట్టి) అతని ఆహారం మరియు బట్టల అవసరం ఎంత మేరకు లేదా అతను తన జీవితాన్ని నిర్వహించగలిగేంత మేరకు అతనిని అడగడానికి అనుమతి ఉంది.. "ఓ ఖుబైసా, (గుర్తుంచుకో) ఈ ముగ్గురిని తప్ప ఎవరికీ ధన సహాయం కోరే అనుమతి లేదు. ఈ మూడు సందర్భాలలో తప్ప ఒక వ్యక్తి ఏదైనా అడిగితే - అది అతనికి నిషేధించ బడుతుంది. అతని ఈ చేష్ట ఆటను నిషేధించబడిన హరామ్ సంపదను తిన్నట్లే. (ముస్లిం)
నేడు కట్నం అడిగే మర్యాద పధ్ధతి ఏమిటంటే, మేము వరకట్నాన్ని హరామ్‌గా పరిగణిస్తున్నాం. మాకేమీ అవసరం లేదు. మీ అమ్మాయికి మీరు ఇవ్వాల్సింది ఎలాగో ఇస్తారు, నగలు గట్రా ఏం ఇస్తున్నారో వివరాలు చెప్పండి చాలు అంటారు. ఇంకొందరైతే - మేము ఆరకట్నాన్ని సాంఘీక నేరంగా భవిస్తాము.. నయా పైసా మాకవసరం లేదు. అయితే మా పెద్ద కోడలు, లేదా మా పక్కింటి వారి కోడలు - ఇంట బంగారం, వంట సామానులు, బైకు, కారు తీసుకొచ్చింది. అవన్నీ మాకేం అవసరం లేదు అంటారు.
కొందరైతే భూములు, ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు కట్నంగా తీసుకుంటారు. వారు అల్లాహ్ కు భయ పడాలి. దైవ ప్రవక్త (స) ఏమన్నారో కాస్త ఆలోచించాలి!
“ఏ వ్యక్తి ఒక జానెడు భూమిని అన్యాయంగా ఆక్రమించుకుంటాడో, అదే చోట మొత్తం ఏడు భూములను క్రింది వరకు త్రవ్వాలని అల్లాహ్ అతనికి శిక్షస్తాడు. మళ్ళీ అల్లాహ్ ప్రజల మధ్య తీర్పు పూర్తి చేసేంత వరకు ఆ ఏడు భూములు అతని మెడలో గుదిబండగా వేయబడుతాయి”. (తబ్రాని ఫిల్ కబీర్: 22/270. సరీహుల్ జామి: 2719.).
8) దుబారాఖర్చుకు దూరంగా
వరకట్నం ఇవ్వడం వల్ల దుబారాగా, వృధాగా ఖర్చు చేయవలసి వస్తుంది. దుబారా మరియు వృధా ఖర్చులను మన షరియత్ దుర్మార్గంగా పేర్కొంది.. దుబారా ఖర్చు చేయకండి. దుబారాఖర్చు చేసేవారు షైతాన్ సోదరులుగా పరిగణించబడతారు. షైతాన్ తన ప్రభువుకు కృతఘ్నుడైపోయాడు. (బనీ ఇస్రాయీల్: 26-27)
9) కట్నం ఇచ్చి గొప్పలు పోవడం
ఎవరి స్వార్ధం వారిది. ఒక అబ్బాయి బాగా నచ్చితే ఎక్కువ మంది అమ్మాయిల తల్లి దండ్రులు అతని వెంట పడతారు. అప్పుడు మిగిలిన వారికి దక్కకుండా ఉండేందుకు ఈ "కట్నము" అనే దానిని ఉపయోగిస్తారు. అలాగే, మేము ఇంత ఇచ్చి మా కూటికి పెళ్లి చేశాము అని గొప్పలు చెప్పుకోవడానికి కొందరు ఇష్ట పడుతుంటారు. ఇస్లాం ధర్మంలో గర్వ ప్రదర్శన, ప్రదర్శనాబుద్ధి నిషిద్ధం.
గమనిక: ఈ పెళ్ళి అనే మార్కెట్ లో అమ్మాయి, అబ్బాయి కూడా ఒక "సరుకు " తో సమానం. ఇప్పుడు అబ్బాయి కి అన్ని యోగ్యతలు ఉన్నా రైతులు, పురోహితులు, చిన్న వ్యాపారులు, ఉమ్మడి కుటుంబములో ఉండే వరులకు పెళ్ళి ళ్ళు కావడం లేదు. కాబట్టి -
ప్రభుత్వ ఉద్యోగాలు, అమెరికా ఉద్యోగులనే కాకుండా మంచివాడు, గుణవంతుడు అయిన అబ్బాయిలను కూడా ఆడ పిల్లలు ఇష్ట పడాలి. ఇది నాణేనికి రెండవ వైపు ఉన్న అంశం. మగ పిల్లలు ఎలా అయితే కట్నం కోసం ఆశ పడకూడదో, ఆడవాళ్ళు ఇలా లేని పోనీ గొప్పలకు పోయి జీవితాన్ని నాశనం చేసుకోకూడదు.
10) పేదరికంలో వరకట్నం వేధింపులకు కారణమవుతుంది
తండ్రులు లేదా సోదరులు తమ కుమార్తెలు లేదా సోదరీమణుల పెళ్లి చేయడానికి, వారి జీవితాలను పణంగా పెట్టి, వారి పొట్టలు కాల్చుకుని, అప్పు చేసి - ఆ తర్వాత తీర్చలేక అల్లాడుతున్నారు. అలాంటి వారి బాధ, వ్యధ వర్ణించలేనిది.
ఎప్పుడైతే బలవంతంగా రకరకాల మారు పేర్లతో వసూలు చేస్తారో లేదా పెళ్ళైన తరువాత అదనపు కట్న కానుకల కోసము హింసిస్తారో అది హేయమైనది. శిక్షార్హము కూడా. చాలా మంది తల్లిదండ్రులు - కట్న కానుకలు ఇచ్చే స్థోమత లేనందుకు ఎక్కడెక్కడోకెళ్లి చేయి చాచే దుస్థితి నేడు ఉంది అంటే దానికర్ణం - మనం చూపని మానవత్వమే, మనం అందించలేని ఆ స్నేహహస్తమే. ఇలా చేసిన కుటుంబాల తర్వాతి తరాలు సర్వ నాశనం అవుతాయి. అయ్యాయి. ఒకరి ఉసురు పోసుకున్నవారు బాగు పడినట్లు చరిత్రలో లేదు. వారు బాధితులు - వారు గోడకి అల్లాహ్ కు మధ్య ఎలాంటి అడ్డొగోడ ఉండదు అన్న విషయాన్ని గ్రహించాలి.
11) భ్రూణ హత్యలకు కారణం కట్నం
కడుపులో ఎదుగుతున్న ఆడబిడ్డను పిండ దశలోనే చిదిమేస్తున్నారు. బాహ్య ప్రపంచానికి రాకముందే భ్రూణ హత్య చేస్తున్నారు. కడుపులోని ఆడ నలుసును నలిపేస్తుండటం వెనక కారణాలెన్నో! మన దేశంలో పుట్టిన బిడ్డను పెంచే స్థోమత లేని నిరుపేద కుటుంబాలు నేటికీ చాలానే ఉన్నాయి. ఆడపిల్లను పెంచి, మగపిల్లలతో సమానంగా చదివించినప్పటికీ, పెళ్ళి సమయంలో వరుడికి కట్నకానుకలు సమర్పించుకోవాల్సి వస్తోంది. వరకట్న దురాచారాన్ని రద్దు చేయడానికి ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలేవీ క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు కావడంలేదు. పుట్టబోయే బిడ్డ ఆడా, మగా అని తెలుసుకోవడానికి పరీక్షలు చేయిస్తున్నారు. ఆడ శిశువు పుడుతుందని తెలిసి కొందరు గర్భస్రావం చేయించుకుంటున్నారు. మరికొందరు పుట్టిన బిడ్డను గుట్టుగా విడిచిపెడుతున్నారు. ఇందుకు వారు చెప్పే ప్రధాన కారణం- అడబిడ్డను సాకలేము పంపడానికి కట్నం తీసుకురాలేమన్నదే!
12) పెళ్లి కానీ ఆడపిల్లల్లో మానసిక రుగ్మతలు
పెళ్లికాని అమ్మాయిలలో మానసిక రుగ్మతలు సర్వసాధారణం, డిప్రెషన్ పెరుగుతోంది. హిస్టీరియా మహమ్మారి పట్టి పీడిస్తోంది. యవ్వనం కొవ్వొత్తిలా కరిగిపోతుంది. , కానీ ఇవన్నీగొప్పోళ్ళకు ఏమీ పట్టదు.
13) ముస్లిం బాలికల మతభ్రష్టత్వానికి ప్రధాన కారణం:
వరకట్న శాపం. కట్నం చెల్లించలేని కారణంగా అమ్మాయిల పెళ్లిళ్లు జరగడం లేదు. ఫలితంగా కొందరు వాంఛకు లోబడి అన్య మతస్తులతో పారి పోయి పెళ్లి చేసుకుంటూ ఉంటె, కొందరు వేరే మార్గం లేక కూడా ఇలా చేస్తున్నారు. దీనికి బాధ్యులు ఎవరు?
14) కొన్ని ప్రాంతాల్లో అమ్మాయిలకు పెళ్లి చేసే స్థోమత లేని పేద తల్లిదండ్రులు తమ కుమార్తెలను అమ్మేసుకుంటుంన్నారు. ఈ దురాచారాన్ని కూడా కట్నమే కనిపెట్టింది.
15) పెళ్లయిన తర్వాత: ది.
తక్కువ కట్నం తెచ్చిన నేరానికి ఓ అమ్మాయిని అత్తమామలు ఇంటి నుంచి గెంటేశారు, ఆ అమ్మాయి తన తండ్రి ఇంటికి వెళ్లి పరిస్థితిని వివరించగా, తండ్రి గుండెపోటుతో మరణించాడు.
మీర్ తకీ మీర్ ఉర్దూ భాషలో ప్రసిద్ధి చెందిన కవి, అతని ఆర్థిక పరిస్థితి బాగా లేదు, అతనికి ఒక కుమార్తె ఉంది, ఆమె పెళ్లిలో ఉన్నదంతా అమ్మి అమ్మాయిని అత్తారింటికి ఏంటో ఘనంగా సాగనంపారు. కూతురు గొప్ప పౌరుషవంతురాలు. పెళ్లి రోజు రాత్రి జరిగిన వ్యవహారమంతా తెలిసింది. తన తండ్రి గురించి ఆలోచిస్తూ తీవ్ర మదన పడసాగింది. కుమిలిపోతూ ఎక్కి ఎక్కి ఏడ్చింది... ఒక దశలో ఆమెకు గుండెపోటు వచ్చి మరణించింది. ఆ రాత్రి మీర్ తకీ మీర్ తన కుమార్తె మరణవార్త తెలుసుకున్నప్పుడు, ఇలా అన్నారు;
ఇప్పుడు ఈ నిరాసక్తతలో ఆలోచన తట్టింది
కట్న సామగ్రిలో నీకు కఫన్ ఇవ్వడం మర్చిపోయా ము అని
ఏమండీ పండితులారా...ఏమంటారు ... మీరేమంటారు... స్త్రీ జాతికి జరిగిన ద్రోహానికి మీరేమని బదులిస్తారు....?
అజ్ఞానం, అనాగరికం మూలంగా ఎవరైనా ఇలాంటి దురాచారాలకు, దుష్టకార్యా, లకు పాల్పడుతున్నారంటే అది కొంతవరకు సబబైనదే. కాని నమాజులు చేస్తూ, రోజాలు పాటిస్తూ గొప్ప ధార్మికులనబడేవారు సయితం వధువు తల్లిదండ్రుల నుంచి లక్షలు గుంజడం ఎంతో శోచనీయమైన విషయం. పైగా కొందరు కట్నకానుకల్ని ధర్మబద్ధమైన విషయాలుగా చిత్రించడానికి అతితెలివిని ఉపయోగిస్తూ, హజ్రత్ ఫాతిమా (రజి) పెళ్ళిలో ఇవ్వబడిన కొన్ని సాధారణ గృహోపకరణాల ఉదాహరణ ఇస్తారు. కానీ ఈ గృహోపకరణాలను దైవప్రవక్త (సఅసం) ఎలా తెచ్చిచ్చారు. వాటిని ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది మొదలైన వాస్తవాలను వీరు విస్మరిస్తున్నారు.
ప్రవక్త కుమార్తె పెళ్ళిలో ఇచ్చిన కానుకలు
హజ్రత్ ఫాతిమా (రజి) పెళ్ళి అయ్యేదాకా హజ్రత్ అతి (రజి) దైవప్రవక్త (సఅసం) సంరక్షణలోనే పెరిగారు. ఆయనకు దైవప్రవక్త (సల్లం) తప్ప ఇతర ఆప్తులు కూడా లేరు. అందువల్ల దైవప్రవక్త (సల్లం) వారిద్దరి కొత్తకాపురం కోసం కావలసిన కనీస గృహోప కరణాలు ఇవ్వడం అనివార్యమయ్యింది. అదైనా హజ్రత్ అలీ (రజి) మహర్ చెల్లించ వలసి ఉన్నందున దైవప్రవక్త (వల్లం) ఆయన దగ్గరున్న యుద్ధకవచం తీసుకొని అమ్మి వీటిని కొనిచ్చారు.
సీరత్ గ్రంథాల అధ్యయనాన్ని బట్టి దైవప్రవక్త (సల్లం) ఆ యుద్ధకవచం అమ్మగా వచ్చిన డబ్బుతో ఒక పడక, ఒక తలగడ, కొన్ని మట్టి పాత్రలు మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన 'మహరి'ని అడ్వాన్సుగా తీసుకొని వీటిని కొనిచ్చారు. ఇలా ఆడ్వాన్సు సహర్ పైకం తీసుకొని కొత్త సంసారానికి కావాల్సిన సామగ్రిని కొనిచ్చే సంప్రదాయం ఈనాడు కూడా ఈజిప్ట్ తదితర దేశాల్లో కొనసాగుతోంది.
దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా గృహోపకరణాలను హజ్రత్ ఫాతిమా (రజి)కు మాత్రమే ఇచ్చారు గాని, తన ఇతర కుమార్తెలెవరికీ ఇచ్చినట్లు చరిత్రలో మనకు ఎక్కడా ఆధారాలు లభించవు. దీన్ని సాకంగా తీసుకొని వేలాది రూపాయల కానుకల్ని గుంజడం ఏ విధంగానూ ధర్మసమ్మతం కాజాలదు. పైగా అది ఇహలోకంలో దేశచట్టం దృష్టి లోనూ, పరలోక పర్యవసానం రీత్యానూ ఘోరమైన వరం అవుతుంది.
అడిగి లేదా వత్తిడిచేసి తీసుకున్న కట్నం కూడా ఒక విధమయిన అంచులా అధర్మమేనని కొందరు ధర్మవేత్తలు అన్నారు. కనుక ఎవరైనా తెలియక తీసుకుంటే తరిగా ఇచ్చివేయడం వాజిబ్ (విధి) అని కూడా వాడు పేర్కొన్నారు. ఈ కాలానికి చిన్నంగా పూర్వం ఒకప్పుడు వధువు తల్లిదండ్రులే వరుని తల్లిదండ్రుల నుంచి కొండ పైకం తీసుకొని తమ కూతుర్ని అత్తవారింటికి సంపించేవారు. ఆనాడు విఖావేత్తలు ఉన్ని లంచంగా, ఆధర్మంగా పరిగణించి తిరిగిచేయాలని తీర్పిచ్చారు.
గమనిక: ఇష్టపూర్వకంగా ఇస్తే బహుమతి, బహుమతి ఇవ్వడంలో తప్పేమిటి? అని కొందరు అడగవచ్చు. ఎవరైనా ఇష్టపూర్వకంగా తన కూతురిని ఇస్తే తప్పేమీ లేదు. కానీ షరతు ఏమిటంటే, వారు ఇష్టపూర్వకంగా ఇవ్వాలి, మీ శక్తిని బట్టి ఇవ్వాలి. ఎవరి ఒత్తిడికి గురికాకూడదు. అల్లా అలా ఇచ్చి వారసత్వాన్ని స్వాహా చేయకూడదు. హా, ఎవరైనా ఒత్తిడి లేకుండా తన కూతురిని బహుమతిగా ఇవ్వాలనుకుంటే, ఇబ్బంది లేదు.
వరకట్న ఆచారాన్ని రద్దు చేయడం ఎలా?
విందులు విడుపులతో కడుపు నిండదు / వీల్లను పట్టుకున్న దన దాహం తీరి చావదు / వరకట్నపు కోరలతో బుస కొట్టే నాగులివి / ఆడ బతుకు నంటుకున్న సీతనాటి జ్వాలలవి / కసికట్టి కాటేసి పెను మంటల తోసేసి / ఇల్లు వల్లకాడు చేసి ఒళ్ళు తగలబెట్టారు.
చదువున్న మనసు లేని యువకులు / నేడు సంతలోన అమ్మబడే పశువులు / సర్వస్వం దారపోసి వదువు కొరకు బేరాలు /కోరినంతకాదంటే వీళ్ళే కొరివి దయ్యాలు..
ఎన్నివేల పూవులిలా రాలి పోయెనో / ఎన్ని అందాల చిరు నవ్వులు కాలిపోయనో / ఏ తరాల కందునమ్మ కన్నవారి కడుపుకోత /ఏ గీతం పాడునమ్మ / కల్లున్నా చూడలేదు న్యాయము / కాళ్ళున్నా కదలిరాదు చట్టము /రోజూ కొక్క ఆడపడుచు కాలుతున్న దేశమిది. రంగుల వలలో చిక్కిన నవయువకుల పాపమిది.
1) చట్టం అవసరమే కానీ, చట్టాన్ని సక్రమంగా అమలు చేయకపోవడమే అత్యధిక మరణాలు నమోదుకు కారణమని జాతీయ మహిళా సంఘం అభిప్రాయం. సమయానికి స్పందించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వరకట్న నిషేధ చట్టం వంటి చట్టాలను ప్రభాన దంతంగా అదులు చేయడం సాధ్యమవుతుంది. రక్షక భటులు కూడా కేసు విషయంలో భక్షకులుగా మారి ఉదాసీనంగా వ్యవహరించటంతో ఈ కేసులు నిలబడట్లేదని న్యాయనిపుణుల అభిప్రాయం. ఇలాంటి కేసుల్లో పోలీసులు త్వరితగతిన విచారణ ప్రారంభించి మొదట్లోనే చర్యలకు దిగితే ఫలితం ఉంటుంది.
2) వారసత్వ హక్కు దక్కేలా చూడాలి / చట్టాల ద్వారా, ఉద్యమాల ద్వారా తరతరాలుగా కొనసాగుతున్న దురాచారాన్ని అరికట్టడం కష్టం. అలాగని ఈ దురాచారాన్ని కొనసాగనివ్వాలని కాదు. సమాజంలో స్త్రీకి పురుషునితో పాటు ఇస్లాం ధర్మం కేటాయించిన ఆస్తిని వారసత్వంగా పొందే వాతావరణం కల్పించాలి.
3) మార్పు యువతలో రావాలి - మార్పు యువతరంతో ప్రారంభం కావాలి. వారి వివాహాలలో కట్నం ఒక కారకంగా ఉండకూడదని వారు వారి తల్లిదండ్రులకు చెప్పేలా చూడాలి. అమ్మాయి తన తల్లిదండ్రులకు చెప్పాలి, ఒక వ్యక్తి ఎంత ధనవంతుడు అనే దాని గురించి కాదు. అతను లోపల ఎవరు ఉన్నారనే దాని గురించి. వరునికి కావలసింది వరకట్నం కాదని / వరం లాంటి వధువే నని చెబుదాం / వరకట్న దురాచారాన్ని తరిమికొడదాం/ కలకంఠి కంట కన్నీళ్లు పెట్టించే వరకట్న రక్కసిని కూకటివ్రేళ్ళతో పెకళించుదాం!
4) ఎత్తిపొడవడం కరెక్ట్ కాదు - వరకట్న ము వద్దంటే ఈ అబ్బాయి కి ఏదో లోపమున్నదని నఖశిఖ పర్యంతం పరీక్ష చేస్తారు.లేకపోతే వచ్చే డబ్బు ఎందుకు వద్దంటాడు అని నిలదీస్తారు. కొందరయితే వరకట్నం తీసుకోకపోయినా - వరకట్నం తీసుకున్నాడనో, గృహ హింస కేసులో లాగి బాగానే దండుకునే ప్రయత్నం చేస్తారు. ఇలా జరగడం సిగ్గుచేటు.
5) రెండు నాల్కల ధోరణి మానుకోవాలి / పెళ్లి ళ్ళలో ఏ కొంచెం తేడా వచ్చినా జీవితాలు నాశనం అవుతాయి.ఏదైనా ఒక అడుగు వేసేటప్పుడు ఆచితూచి వేయాలి.అపాత్రదానము చేస్తే ఆ పాపము మన మెడకు చుట్టుకుంటుంది. అయినా ఈవరకట్న నిషేధం గురించి కొడుకు పెళ్ళి లో ఎవరూ ఆలోచించరు.కూతురు పెళ్లి లోనేగదా గుర్తు చేసుకునేది.కూతురు పెళ్లి లో వరకట్ననిషేధంగురించి పెద్ద కంఠంతో ఖండించే వారు చాలా మంది కొడుకు పెళ్ళి లో నిశ్శబ్దంగా కట్నం తీసుకునే వారిని నేను చాలా మంది ని చూశాను.ఇలాంటివారిలో మహా పండితులు కూడా ఉన్నారు. ఇక కోట్లకు పడగలెత్తిన కుబేరుల, రాజకీయ నాయకుల వివాహ, వరకట్న తంతు - అది వేరు.
విన్నపం: హెచ్చరించినా కొంత మంది వరకట్న లావాదేవీలు ఆపకపోతే పండితులు, సంఘ పెద్దలు వారిని బహిష్కరించాలి. వారి వివాహ వేడుకలకు హాజరుకాకూడదు.
ప్రజలందరూ ధర్మాన్ని రక్షణ కవచంగా ధరించాలి. ప్రతిగా అల్లాహ్ వారికి రక్షణగా ఉంటాడు. . ఏది సంఘాన్ని కట్టుబాటులో నిలుపుతుందో అదే ధర్మం. ధర్మ మార్గంలో నడిచిన వారికి సుఖశాంతులు, శాశ్వతకీర్తి, స్వర్గ లోక ప్రాప్తి కలుగుతాయి. ‘ఇస్లాం ధర్మమే సర్వ జగత్తుకూ ఆధారం’. ఇస్లాం ధర్మం కంటే బలమైనది ఈ సృష్టిలో మరేదీ లేదని.. ఇస్లాం ధర్మాన్ని అనుసరించే బలహీనుడు రాజుకన్నా బలవంతుడు, విస్మరించిన వ్యక్తి మహా రాజైనా అల్లాహ్ దృష్టిలో అల్పాతి అల్పుడే. అట్టి ధర్మాన్ని విస్మరిస్తే జరిగేది పతనమే.
మారింది, అర్థం మారింది, వ్యర్థంగా తయారైంది సమాజం,వివాహ బంధానికి కరెన్సీతో విలువ కట్టింది, ఎంత ఎక్కువైతే అంత హోదా! !కన్నవాళ్ళను కష్టాల పాలుజేసే కాలకూట విష సమానమైన ఆలోచన, వరుడని,ఘనుడని దోపిడీ దొంగల్లా దోచుకునే రహదారి, పాతాళానికి పాతుకొని పోయిన విషవృక్షం, అక్షరాస్యులు ,నిరక్షరాస్యులూ తేడా లేదు, దీనికెవరూ అతీతంగాదు,
మారును లోకం తీరును కష్టం!
కొడుకును అమ్ముకునే ఆలోచన పోతుందా ఈసమాజంలో, అమ్మాయిని అదృష్టము, శుభవార్త, స్వర్గ సోపానం అని తలుస్తుందా ఇకనైనా , వరకట్నాలు లేని, ఆదర్శ కుటుంబం వస్తుందా ,నిలుస్తుందా, నిలబడుతుందా ఏమో ! వేచి చూద్దాం! !
మానవజీవితానికి పరమ ప్రయోజనమైన ఇహపరాల మోక్షం.కేవలం ఇస్లాం ధర్మంతోనే సాధ్యం. తొలి ప్రాధాన్యత ధర్మానికే, తొలి స్థానం ధర్మానిదే. అంటే, సంపాదన అయినా, సంసారమయినా, ఆర్ధిక విధానాలైనా, రాజకీయ తీరుతెన్నులైనా, జాతీయం అయినా, అంతర్జాతీయం అయినా - ధర్మాన్ని అనుసరించి ఉండాలని దీని అర్థం. అటువంటి ధర్మాన్ని పాటించి.. జీవితాన్ని సార్థకం చేసుకుందాం. ధర్మో రక్షతి రక్షితః…!
మారాలి మారి తీరాలి - మనిషి మనసు మహిళకు వరమవ్వాలి - అత్తంటే అమ్మ ప్రేమకు ప్రతిరూపమవ్వాలి - మామంటే నాన్న నవనీత హృదయమవ్వాలి - భర్తంటే భరోసా ఇచ్చే బాధ్యతా హితవరి కావాలి - ఆడబిడ్డంటే అనురాగబంధమవ్వాలి. .
అందమైన అత్తింటి బంధం - ఆడపిల్ల భవితకు – ప్రేమగంధమవ్వాలి!


Comments
Post a Comment